రివ్య్యూ: నాచురల్ జెంటిల్ మన్!

66

index
తారాగణం: నాని, సురభి, నివేదా థామస్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: మణిశర్మ
బ్యానర్: శ్రీదేవీ మూవీస్
రచనా సహకారం-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటి
రేటింగ్: 3.25/5
ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి వరుస హిట్లతో దూసుకుపోతున్నా… తన ట్రాక్ ను ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు తీసుకెళుతున్నాడు నాని. వరుస హిట్లు వస్తున్నాయి కదా.. బాధ్యత పెరిగి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని ప్రశ్నిస్తే… ఎందుకు.. ప్రస్తుతం తీసుకుంటున్న జాగ్రత్తలు బాగానే ఫలితాలిస్తున్నాయి కదా? ఇంకెందుకు మరింత జాగ్రత్తలు తీసుకుని బోల్తాపడటం అని ఓ సందర్భంలో అన్నాడు నాని. నిజమే.. నాని ప్రస్తుతం తీసుకుంటున్న ఈ జాగ్రత్తలే ఆయన్ను విజయాల వైపు నడిపిస్తున్నాయి. అందులో భాగంగానే మరో సినిమాను కూడా కంప్లీట్ చేసేసి నేడు ‘జెంటిల్ మన్’గా మన ముందుకొచ్చాడు. మరి ఈ జెంటిల్ మన్ ఏవిధంగా ఆకట్టుకున్నాడో చూద్దామా?
కథ: పక్కపక్క సీట్లలో ఇద్దరు వ్యక్తులు కూర్చుంటే.. ఒకరినొకరు పలకరించుకుంటాం. ఒకరి విషయాలు ఒకరు తెలుసుకుంటాం. అలానే జెంటిల్ మన్ లో కూడా హీరోయిన్లు ఇద్దరూ ఫ్లైట్లో ఇండియాకొస్తూ… తమ గురించి ఒకరినొకరు పరిచయం చేసుకుని.. వారి ప్రేమ గురించి రివీల్ చేసుకుంటారు. వీరిలో మొదట తనకు త్వరలో పెళ్లి కాబోతోందని ఐశ్వర్య(సురభి) చెప్పగా.. తాను ప్రస్తుతం లవ్ లో వున్నానని చెబుతుంది కేథరిన్(నివేదా థామస్). ఇంట్రెస్టింగ్ గా వుంది నీ స్టోరీ.. మొదట నీ లవ్ గురించి చెప్పాలని కేథరిన్ ను కోరుతుంది ఐశ్వర్య. దాంతోను గౌతమ్(నాని)తో ఎలా ప్రేమలో పడింది.. అతనితో వున్న బంధం గురించి చెబుతుంది. ఆ తరువాత ఐశ్వర్య కూడా తనకు జై(నాని)తో కలిసి త్వరలో పెళ్లి పీఠలెక్కుతున్నాని తన లవ్ స్టోరీని రివీల్ చేస్తుంది. ఈలోగా ఇండియాకు చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో గౌతమ్ పోలికలతో వున్న జై.. ఐశ్వర్యను రిసీవ్ చేసుకోవడానికి రావడంతో కేథరిన్ షాక్ కు గురవుతుంది. వెంటనే గౌతమ్ ఇంటికి వెళ్లి చూడగా.. గౌతమ్ ఓ యాక్సిడెంట్లో చనిపోయాడని గౌతమ్ తల్లి చెబుతుంది. అయితే గౌతమ్ యాక్సిడెంట్లో చనిపోలేదని.. అతని మరణం వెనుక మిష్టరీ వుందని నిత్య(శ్రీముఖి) చెప్పడంతో.. గౌతమ్ మరణం వెనుక వున్న నిజా నిజాలను నిగ్గుదేల్చడానికి కేథరిన్ ప్రయత్నిస్తుంది. అతని కంపెనీలోనే చేరి గౌతమ్ మరణానికి కారకులెవరు? అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అసలు గౌతమ్ చనిపోయాడా లేదా అనేదే మిగతా కథ.
కథ..కథనం విశ్లేషణ: అష్టా చెమ్మా తరువాత నాని, ఇంద్రగంటి కాంబినేషన్లో సినిమా అనగానే.. వరుస విజయాలున్న నాని… ఫ్లాపుల్లో వున్న దర్శకుడితో సినిమా ఎలా ఒప్పుకున్నాడని అందరూ అనుకున్నారు. అయితే కథలో బలం వుండబట్టే.. తను ఒప్పుకున్నాడు తప్ప… ఏదో మొహమాటానికి పోయి ఆబ్లిగేషన్ తో సినిమా చేయలేదని నాని ఇంటర్వ్యూల్లోనే చెప్పేశాడు. సినిమా చూసిన తరువాత నాని చెప్పింది నిజమే అని అర్థం అవుతుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ కూడా పూర్తిగా తన ప్లాట్ ను మార్చేసి.. ఓ కమర్షియల్ సినిమాను తెరకెక్కించాడానికి ట్రై చేశాడు. తమిళ రచయిత రాసిన ఓ కథను తెలుగు నెటివిటీకి అనుగుణంగా ఓ ఏడాది పాటు రాసి… ఆ తరువాత దీన్ని పట్టాలెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే ఈ మూవీలో అనేక ట్విస్టులైతే వున్నాయి కానీ… వాటిని ప్రేక్షకులు మాత్రం ముందుగానే పనిగట్టేస్తారు. తరువాత జరబోయేది ఏంటనేది ఇట్టే చెప్పేస్తారు. దాంతో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కాస్త… చప్పగా సాగిపోతున్నట్టు కనిపిస్తుంది. మొదటి హాఫ్ లో గౌతమ్… జై ల లవ్ స్టోరీస్ కాస్త ఇంట్రెస్టింగ్ గా వున్నా.. స్లో నెరేషన్ కారణంగా ప్రేక్షకులు సహనంతో కుర్చీలో కూర్చుండిపోవాల్సి వస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ట్విస్టుతో ద్వితీయార్థంపై కాస్త ఇంట్రెస్ట్ కలిగినా… ద్వితీయార్థంలో నాని మరో షేడ్ చూపించడానికి సమయమంతా సరిపోయింది. అతడే విలన్ అనేందుకు ఓ సస్పెన్స్ ను నడపడానికి దర్శకుడు ట్రై చేశాడు కానీ అది అంతగా క్యారీ కాలేదు. జై ప్లేసులో గౌతమ్ వచ్చి నటిస్తున్నాడనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. అవసరాల శ్రీనివాస్ వద్ద కెళ్లి డబ్బులు ఇవ్వడం.. అతడి వార్నింగ్ అన్నీ చూసిన వారికి అతడే అసలు విలన్ అని.. నాని కేవలం నటిస్తున్నాడని తెలిసిపోతుంది. అయితే నాని.. విలన్ అవసరాల శ్రీనివాస్ చేతిలో ఎలా చిక్కాడనే విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్ క్రియేట్ చేసి.. క్లైమాక్స్ లో రివీల్ చేసిన విధానం బాగుంది. ఎప్పటిలాగే నాని ఇందులో కూడా నాచురల్ గా నటించాడు. జై.. గౌతమ్ రెండు పాత్రల్లోనూ చక్కటి వేరియేషన్ చూపించాడు. ముఖ్యంగా ద్వితీయర్థంలో నాని చాలా మెచ్యూర్డ్ గా నటించాడు. నాని తరువాత చెప్పుకోవాల్సింది నివేదా థామస్ గురించి. బాయ్ ఫ్రెండ్ మరణం వెనుక వున్న మిస్టరీని ఛేదించే యువతి పాత్రలో చాలా బాగా నటించింది. ఆమె నటనకు వందకు వంద మార్కులు వేయక తప్పదు. మరో మలయాళ కుట్టి తెలుగుకు దొరికినట్టే. సురభ పాత్ర కూడా పర్వాలేదు. ఇక నెగిటివ్ రోల్ పోషించిన అవసరాల శ్రీనివాస్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. కమెడియన్ గా వెన్నెల కిశోర్ మాత్రం కాసేపు అలరించాడు.
ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇప్పటి వరకు సాఫ్ట్ స్టోరీస్ నే డీల్ చేశాడనే ముద్ర వుంది. ఈ సినిమా చూసిన తరువాత.. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ కథలను కూడా డీల్ చేయగలడా అనిపిస్తుంది. ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని వుంటే మరింత గ్రిప్పింగ్ గా వుండేది. సుమారు 2 గంటలా 24 నిమిషాల నిడివి వుండటంతో కొంత లెంగ్త్ అయినట్టు అనిపిస్తుంది. చాలా సీన్లకు కత్తెర వేయొచ్చు. మణిశర్మ తనేంటో నిరూపించాడు. నేపథ్య సంగీతం సూపర్బ్. పాటలు సోసోగా వున్నా సంగీతం మాత్రం ఈ చిత్రానికి ప్లస్ అనే చెప్పాలి. అలానే సినిమాటోగ్రఫీ కూడా చాలా ప్లీజంట్ గా వుంది. ఓ థ్రిల్లర్ మూవీకి వుండాల్సిన మూడ్ ని బాగా క్యారీ చేశాడు. నిర్మాత చాలా కాలం తరువాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించాడు. బాలయ్యతో గతంలో ఆదిత్య 369లాంటి సినిమాను తెరకెక్కించిన కృష్ణ ప్రసాద్.. మంచి అభిరుచిగల నిర్మాత అని మరోసారి రుజువైంది.
-మను వడ్డె

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here