ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ నిలిపివేస్తూ ప్రభుత్వ జీవో

136

రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈసీ నిబంధనల పరిధిలోకి రాదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా గత రాత్రి నుంచి ఇప్పటివరకు మూడు జీవోలను విడుదల చేసింది. మంగళవారం రాత్రి సీఈసీ ఆదేశాలకనుగుణంగా ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు కడప జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మరో జీవోను విడుదల చేసింది. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఈసీ నిబంధనల పరిధిలోకి రాదని నిబంధనలు స్పష్టంచేస్తున్నందున రాష్ట్రంలోని కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల్లో ఉన్న పోలీసు సిబ్బందిని ఈసీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఈ జీవో వెలువరించిన కాసేపటికే మరో ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. మంగళవారం రాత్రి ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. కేవలం ఇద్దరు ఐపీఎస్‌లను మాత్రమే బదిలీచేస్తూ చేస్తున్నట్టు పేర్కొంది. ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును రిలీవ్‌ చేయలేదు. ఆయన బదిలీని నిలిపివేస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here