ఇంటెలిజెన్స్‌ లేకుండా పోలీసు వ్యవస్థ ఎలా?

222

ఏపీ పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిశితంగా పరిశీలిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ప్రభుత్వ వ్యవహారశైలిపై సీఈసీ సమాచారం సేకరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామన్నారు. సీఎస్‌, డీజీపీ నుంచి వచ్చే వివరణలను సీఈసీకి పంపుతున్నట్లు ద్వివేది చెప్పారు. ఈసీ నిర్ణయాలపై అభ్యంతరం ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని.. ఐపీఎస్‌ల బదిలీ వ్యవహారంపై ఎన్నికల సంఘం తరఫున గురువారం హైకోర్టులో వాదనలు వినిపిస్తామని ఆయన వివరించారు. ఈ అంశాన్ని సీఈసీ నేరుగా పర్యవేక్షిస్తోందని చెప్పారు.
పోలీసుల కదలికలు, ఎన్నికల సిబ్బంది తరలింపు, శాంతిభద్రతల తదితర అంశాలు ఇంటెలిజెన్స్‌తోనే ముడిపడి ఉంటాయని ద్వివేది అన్నారు. ‘‘మాజీ మంత్రి వివేకా హత్యకేసులో నిఘా విభాగం సమాచారాన్ని సేకరించాలి కదా! దివంగత ఎమ్మెల్యే కిడారి హత్య కేసులో ఇంటెలిజెన్స్‌ పని ఉండదా? ఇంటెలిజెన్స్‌తో సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యం? సరైన అంచనా లేకుండా పోలీసులను ఎలా తరలిస్తారు? ఇంటెలిజెన్స్‌ లేకుండా పోలీసు వ్యవస్థ ఉంటుందా? ఎన్నికల నిర్వహణలో మొత్తం పోలీసు వ్యవస్థ ఉండి.. ఎన్నికలతో ఇంటెలిజెన్స్‌కు సంబంధం లేదంటే ఎలా?’’ అని ద్వివేది ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here