ఇంగ్లీష్‌కు టీడీపీ వ్యతిరేకం అన్నట్లు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది – వంగలపూడి అనిత

89

రాష్ట్రంలో ఇబ్బడి ముమ్మడిగా నెలకొన్న సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా,తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతిలపై మాజీ శాసనసభ్యురాలు వంగలపూడి అనిత విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యార్థుల భవిష్యత్తును మార్చడం సదాశయమే కానీ అసలు రాష్ట్రంలో తల్లిదండ్రుల ఉపాధికి గండికొట్టి జీవనమే భారంగా మార్చి పిల్లల భవిష్యత్తును హరించేలా దుర్మార్గంగా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో ప్రావీణ్యమున్న ఉపాధ్యాయుల కొరత మూలంగా భవిషత్తులో బోధనలోనూ ఇబ్బందులు తలెత్తి విద్యార్థులు విజ్జ్ఞానార్జనలో మరింత కష్టాలు పాలయ్యే స్థితి తలెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మీడియం లోనే చదివినా ఉన్నత చదువులు అభ్యసించి దేశవిదేశాల్లో పలు రంగాల్లో రాణించిన తెలుగుజాతి ఆణిముత్యాల చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. జగన్‌ ఆరు నెలల పాలనలో అస్తవ్యస్త నిర్ణయాలతో లక్షల మంది పేదల పొట్టకొడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆవేదన కలిగించడంతో వైకాపా ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి తంటాలు పడుతున్నట్లు లక్ష్మీపార్వతి, రోజాల ప్రకటనలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు. అన్ని విధాలా వైఫల్య బాట పట్టడంతో ప్రజలకు మరేమీ అవసరం లేదన్నట్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్ల్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని ఓ ప్రహసనంగా మార్చారని దుయ్యబట్టారు. ఇంగ్లీషు మీడియం ఉన్నప్పటికీ అదే సమయంలో మాతృభాష అత్యంతావశ్యకమని రాష్ట్ర ప్రజలే కాదు దేశం మొత్తం భాషావేత్తల, మేథావుల సూచనలను పెడచెవినపెట్టడం మంచిదికాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించడంతో 35 లక్షల మంది రోడ్డున పడటం సమస్యేకాదని పట్టించుకోకపోవడం వైకాపా నేతల్లో మానవతా దృక్పథం లోపించిందని స్పష్ట మవుతోందన్నారు. 5 నెలలుగా పని లేక చేతికి చిల్లుగవ్వ దొరకక కుటుంబాన్ని పస్తులు పెడుతూ పిల్లల కడుపు నింపలేని దురవస్థ కల్పించిన జగన్‌ ను వారు నిలదీస్తే ప్రయోజనం ప్రజలు హర్షించే వారన్నారు. రాష్ట్రంలో అనేక మందిపై ముఖ్యంగా మహిళలపై వైకాపా నేతలు దాడులు జరుపుతున్నా ఇన్నాళ్లూ ఎక్కడున్నారని రోజా, లక్ష్మీ పార్వతిలను నిలదీశారు. కృష్ణా నది వరదల్లో వేల ఎకరాలు మునిగి పంట నష్టం , ఇళ్ళు వరదల్లో మునగడంతో రోడ్డున పడ్డ మహిళల గోడును ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఓ విజన్‌ తో విభజిత ఆంధ్రప్రదేశ్‌ ను క్రమక్రమంగా స్వయం సమృద్ధి సాధించేలా ఒక కొలిక్కి తెస్తున్న సమయంలో అసత్యాలు, అబద్దాల ప్రచారంతో ప్రజలను మోసం చేసినందుకు జగన్‌ మీకు పదవులు అప్పగించారన్నారు. జగన్‌ మెప్పు పొందేందుకు ఇప్పుడు కూడా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడమే పేదల అభ్యున్నతి అంటూ కొత్తపల్లవి అందుకొని ప్రజలను తప్పుదారి పట్టించడానికి తిప్పలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. పదవులకు అలంకారం తప్పితే ఆ పదవులే అప్రతిష్ట తేవడంలో వైకాపా మంత్రులు, నామినేటెడ్‌ పదవులు అనుభవిస్తున్ననేతలు పోటీ పడుతున్నారు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని అనిత విమర్శించారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here