రివ్యూ: అయ్యో… అయ్యో… బంగారం!

487

తారాగణ: వెంకటేష్, నయనతార, పృథ్వీ, పోసాని, సంపత్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, గిరి తదితరలు
సంగీతం: జీబ్రాన్
నిర్మాతలు: నాగవంశీ, పి.డి.పి.ప్రసాద్
కథ-మాటలు: మారుతి, డార్లింగ్ స్వామి
స్క్రీన్ ప్లే- డైరెక్షన్: మారుతి
రేటింగ్: 2.75
డైరెక్టర్ మారుతి… భలే భలే మగాడివోయ్ సినిమా నుంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్లు తీస్తాడనే బ్రాండ్ తెచ్చుకున్నాడు. తాజాగా విడుదలైన బాబు.. బంగారం సినిమా కూడా అలాంటి క్లీన్ ఎంటర్టైన్ మెంటే అని మారుతి అండ్ కో ప్రచారం చేసుకుంది. ఇందులో వెంకటేష్.. నయనతార జోడీ.. ఇంతకు ముందు లక్ష్మీ సినిమాను గుర్తుకుతెస్తుందని కూడా ప్రచారం చేసింది. చాలా కాలం తరువాత వెంకీ ఓ ఫుల్ కామెడీ ఎంటర్టైన్ మెంటు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడని ప్రచారం చేసిన ‘బాబు బంగారం’ టీమ్ మాటలు ఎంత నిజమో చూద్దామా?
కథ: క్రైం బ్రాంచ్ ఎ.సి.పి.కృష్ణ(వెంకటేష్) చాలా జాలీ.. దయాగుణం వున్నోడు. పక్కవారికి ఏదైనా ఇబ్బంది కలిగితే.. ఆయన కూడా కర్పూరంలా కరిగిపోతాడు. ఈ జాలీ.. దయ.. మంచితనం అనే బలహీనతలు అతని తాత రాయల్(వెంకటేష్.. ద్విపాత్రాభినయం) నుంచి వచ్చుంటాయి. అతడు కూడా తమని బ్రిటీష్ వాళ్లు ఎంత హింసించినా… అవేవీ పట్టించుకోకుండా వాళ్లను చేరదీసి భోజనం పెట్టి అతిథి మర్యాదలు చేసేంత దయాగుణగుణం అతనిది. అలాగే తను గుండెనొప్పితో బాధపడుతున్నా… నాకంటే ముందు.. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెకు ముందు ఆపరేషన్ చేసి ఆమెను బతికించండని డాక్టర్లకు చెప్పి.. ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అలాంటి వారసత్వం నుంచి వచ్చిన కృష్ణ.. తను చేస్తుంది పోలీస్ డిపార్ట్ మెంట్లో అయినా… రౌడీల మీద జాలీ చూపుతూ… సున్నితంగా కేసులను డీల్ చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి శైలజ(నయనతార) ప్రేమలో పడతాడు. ఆమె బాధల్లో వుంటే అన్ని విధాల ఆదుకుంటాడు. అలా ఇద్దరూ ప్రేమించుకుని… పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. మరో వైపు తన తండ్రి ఆచూకీ చెప్పాలంటూ శైలజను రౌడీలు బెదిరిస్తుంటారు. తమ నాన్నమ్మకు గుండెపోటు రావడంతో… ఆమెను చూడటానికి వచ్చిన శైలజ తండ్రి శాస్త్రి(జయప్రకాష్)ని ఆసుపత్రిలో చుట్టుముడతారు. ఇదంతా శాస్త్రిని పట్టుకోవడానికి ఎ.సి.పి.కృష్ణ వేసిన ప్లానింగే అని చెప్పడంతో… శైలజ షాక్ కి గురవుతుంది. మరి ఏసీపీ కృష్ణ శాస్త్రిని ఎందుకు పట్టుకోవాలనుకున్నాడు? శైలజ.. కృష్ణ ప్రేమ చివరకు ఏమైంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ-కథనం విశ్లేషణ: క్లీన్ ఎంటర్టైన్ మెంట్ పేరుతో తల.. తోక లేని స్క్రిప్టుతో సినిమాను తీస్తే… ఎలా వుంటుందో… బాబు బంగారం చూస్తే తెలుస్తుంది. కేవలం కామెడీ పేరుతో ఎలాంటి స్టోరీ లైన్ లేని సినిమాను దర్శకుడు మారుతి సెల్యులాయిడ్ పై చూపించడం ఓ రకంగా.. అత్యాశే. వెంకటేష్.. నయనతార లాంటి సీనియర్ తారలతో సినిమా తీసేటప్పటుడు.. వారి నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమాను ఆశిస్తారనేది తెలుసుకోకుండా ఓ నాసిరకం ఎంటర్టైన్ మెంట్ తీయడం దర్శకుడు మారుతికే చెల్లింది. భలే భలే మగాడివోయ్ సినిమాను తీశాడనే ఒకే ఒక పాజిటివ్ ఒపినీయన్ తో నిర్మాతలు కూడా మారుతి చెప్పినట్టే తలూపేశారనిపిస్తోంది. సినిమాలో అంత స్టార్ కాస్ట్ పెట్టి తీస్తున్నప్పుడు కనీసం కథ మీద కొంతైనా దృష్టిసారించకపోవడం శోచనీయం. ఎ.సి.పి.లాంటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే… సొసైటీలో అరాచకాలు సృష్టించే రౌడీ మూకలు హడలిపోవాలి. కానీ.. ఎ.సి.పి. క్యారెక్టర్ జాలీ..దయ.. మంచితనం అంటూ సిల్లీగా వ్యవహరిస్తుంటే… ఇక దాన్ని చూసే ప్రేక్షకుల పరిస్థితి ఎలావుంటుందో ఇట్టే అర్థం అవుతుంది. ఇందులో వెంకటేష్ బొబ్బిలి రాజా చిత్రంలో అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో.. అంటూ కామెడీ ఫైట్లు చేయడం మరీ సిల్లీ అనిపిస్తుంది. ఎంత పాత సినిమా పాటల ట్రాక్ లు.. సీన్లు వాడినా… సినిమాలో నవ్వు రాదు. పైగా ఇలాంటి సీన్లు తెరకెక్కించిన డైరెక్టర్ మారుతిపై జాలి కలుగుతుంది.
ఇందులో కొంతైనా నవ్వు తెప్పించింది పృథ్వీనే. బత్తాయి బాబ్జీగా అక్కడక్కడా నవ్వించాడు. బాలయ్య స్పూఫ్ చేసినా… మిగతా సీన్లలో కొంత ఫ్రెష్ నెస్ వుండటంతో పృథ్వీ ఎపిసోడ్లన్నీ ఫన్నీగానే వున్నాయి. వెంకటేష్.. నయనతార జోడీ బాగుంది. ముఖ్యంగా వెంకీ చాలా స్లిమ్ గా తన పాత చిత్రాలను గుర్తుకు తెస్తాడు. మిగతా క్యారెక్టర్లలో నటించిన పోసాని.. సంపత్.. బ్రహ్మానందం.. వెన్నెల కిశోర్ పాత్రలు అంతంత మాత్రమే. బ్రహ్మానందం ‘మ్యాజిక్’ కామెడీ ఇరిటేటింగ్ గా వుంది. వెన్నెల కిశోర్ వున్నా.. లేనట్టే. ఈ చిత్రానికి ప్రధానంగా మైనస్ కథ… కథనం. కథ.. మాటలు మారుతి.. డార్లింగ్ స్వామి కలిసి రాశారు. కానీ వీరిద్దరూ ప్రేక్షకులను ఆకట్టుకునే కథను తయారుచేయలేదని సినిమాను చూస్తే అర్థం అవుతుంది. స్క్రీన్ ప్లే కూడా నాసి రకమే. సంగీతం అందించిన జీబ్రాన్ మార్క్ పాటల్లో తప్ప… నేపథ్య సంగీతంలో ఏమాత్రం కనిపించదు. ఎడిటింగ్ అంతంత మాత్రమే. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. ఈ సినిమా బి.సి.సెంటర్లలో ఏమైనా నచ్చితే నచ్చొచ్చు. అంతేగానీ… ఎ క్లాస్ సెంటర్లలో ఎక్కడం చాలా కష్టం. చూడాలి… మరి వెంకీ మార్కుతోనైనా సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు బయటపడతారేమో?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here