అమెరికా నిఘా సంస్థ చేతిలో ఆధార్‌ డేటా! 

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో అనేక కేంద్ర పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఆధార్‌ డేటా సురక్షితమేనని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆధార్‌ డేటాబేస్‌ను అమెరికా నిఘా సంస్థ తెలుసుకునే అవకాశం ఉందని వికీలీక్స్‌ సంచలన ప్రకటన చేసింది.
అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీఐఏ) ఓ ప్రత్యేక టూల్‌ సాయంతో ఆధార్‌ డేటాను రహస్యంగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోందని వికీలీక్స్‌ ఓ డాక్యుమెంట్‌ను ప్రచురించింది. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా డాక్యుమెంట్‌ లింక్‌ను షేర్‌ చేసింది. ‘ఎక్స్‌ప్రెస్‌లేన్‌ అనే టూల్‌ను సీఐఏ ఉపయోగిస్తోంది. ఈ టూల్‌ను అమెరికాకు చెందిన క్రాస్‌మ్యాచ్‌ టెక్నాలజీస్‌ తయారుచేసింది. దీని సాయంతో క్రాస్‌మ్యాచ్‌ టెక్నాలజీస్‌కు అనుసంధానంగా ఉన్న సర్వీసుల నుంచి డేటాను రహస్యంగా తెలుసుకోవచ్చు’ అని వికీలీక్స్‌ డాక్యుమెంట్స్‌లో పేర్కొంది.

ఆధార్‌ నమోదు కోసం ఉపయోగించిన బయోమెట్రిక్‌ పరికరాలలో కొన్నింటిని క్రాస్‌మ్యాచ్‌ టెక్నాలజీస్‌ తయారుచేసింది. ఈ పరికరాలను ఉడాయ్‌ కూడా ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో వికీలీక్స్‌ డాక్యుమెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. అంతేగాక.. క్రాస్‌మ్యాచ్‌ లాంటి కంపెనీల బ్యాగ్రౌండ్‌ను చూసుకోకుండానే ఉడాయ్‌ వీటిని ధ్రువీకరించి ఉంటుంది అని వికీలీక్స్‌ డాక్యుమెంట్‌లో పేర్కొంది. అంతేగాక రియల్‌ టైమ్‌లో ఆధార్‌ డేటాబేస్‌ను సీఏఐ తెలుసుకోవచ్చు అని తెలిపింది.

క్రాస్‌మ్యాచ్‌ టెక్నాలజీస్‌ వార్తల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. 2011లో అమెరికా పాక్‌లో సీక్రెట్‌ ఆపరేషన్‌ చేపట్టి.. ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ను హతమార్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమెరికా మిలిటరీ క్రాస్‌మ్యాచ్‌ తయారుచేసిన ఓ పరికరంతోనే లాడెన్‌ను గుర్తించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *