అమరావతి కేంద్రంగా ‘టాటా సన్స్’

అమరావతిలో విద్యుత్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్ల వంటి ఆధునిక రవాణా వ్యవస్థలో భాగస్వాములం అవుతామని టాటా సన్స్ బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అన్నారు.

శుక్రవారం సింగపూర్‌లో ముఖ్యమంత్రితో జరిపిన ద్వైపాక్షిక సమావేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పెట్టుబడులకు ఎంతో ఆసక్తిగా వున్నామని చంద్రశేఖరన్ తెలిపారు. త్వరలో ఏపీకి వచ్చి అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించడానికి సిద్ధమని వెల్లడించారు.

ఏపీలో సంపూర్ణ కాలుష్యరహిత రవాణా వ్యవస్థ ఏర్పాటుకు పూనుకున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు.

రాష్ట్రంలో టీసీఎస్ కార్యకలాపాలు పెద్దఎత్తున చేపట్టాలని చంద్రశేఖరన్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఐటీ రంగంలోనే కాకుండా అనేక అంశాలలో పెట్టుబడులు పెడతామని, స్మార్ట్ సిటీల రూపకల్పనలోనూ తమ సహకారం వుంటుందని చంద్రశేఖరన్ చెప్పారు.

రాబోయే మూడు వారాల్లో అమరావతికి వస్తానని, హోటళ్లు, స్మార్ట్‌ సిటీలు, రవాణారంగం తదితర అంశాలపై ఆయా విభాగాధిపతులను తన వెంట తీసుకొస్తానని తెలిపారు.

ముఖ్యమంత్రితో సింగపూర్ రాయబారి భేటీ
జులై, నవంబరులో జరిగే రెండు అతి ముఖ్య సమావేశాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సింగపూర్ ప్రభుత్వ రాయబారి గోపీనాథ్ పిళ్లై కోరారు.

నవంబరులో జరిగే ‘సౌత్ ఏషియా డయాస్ఫోరా మీట్’కు తప్పని సరిగా రావాలని ఆహ్వానించారు.
ముఖ్యమంత్రితో పాటు సింగపూర్ పర్యటించిన బృందంలో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ,

ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఏపీ ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్ వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *