అభివృద్ధికి, అవినీతి డబ్బుకి మధ్య పోటీ జరుగుతుంది-ఏపి మంత్రి దేవినేని

16

కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ ప్రజల కోసం ఎన్ని రోజులైనా కష్టపడతానని, ప్రాణాలిస్తానని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వేలాదిమంది కార్యకర్తల సమక్షంలో ప్రమాణం చేసారు. గురువారంనాడు మైలవరం నియోజకవర్గ అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఆయన ఉత్సాహంగా పాల్గొని అనర్గళంగా ప్రసంగించారు. మైలవరం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులకు, వైకాపా అభ్యర్థి అవినీతి డబ్బుకు మధ్యన పోటీ జరుగుతుందని అన్నారు. వైకాపా నాయకులు ప్రజల్ని నమ్మించి అవినీతి డబ్బుతో వాళ్ళ గట్టుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, మైలవరం నియోజకవర్గంలో ఆ గట్టైనా, ఈ గట్టైనా… ఏ గట్టైనా మనగట్టన్న సంగతి వాళ్ళకు తెలియదని ధ్వజమెత్తారు. 1999 ఎన్నికల్లోనే నాపై పోటీచేసి ఓడిపోయిన వ్యక్తి దశాబ్దాలపాటు రాజకీయ రంగంలో కనుమరుగయ్యారని, మళ్ళీ డబ్బు సంచులతో తెరమీదకొచ్చారని విమర్శించారు. నియోజకవర్గమంతటా వందల, వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకున్నట్లు, ప్రతి గ్రామంలోనూ అన్ని సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్లు చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం మైలవరం నియోజకవర్గ ప్రజల గుండెకాయ వంటిదని, మెట్టరైతుల సాగునీటి శాపాలకు శాశ్విత విముక్తిని కలిగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5వేల కోట్ల రూపాయలతో చింతలపూడి ఎత్తిపోతల పథకంను మంజూరు చేసారని కొనియాడారు. నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ళు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నట్లు తెలిపారు. రెండు నెలల్లో మైలవరానికి, కొండపల్లికి ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు తీసుకొస్తున్నట్లు తెలిపారు. మళ్లీ మైలవరం నియోజకవర్గంలోనే పోటీచేసి హ్యాట్రిక్ కొడతానని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య దేవినేని ఉమా శపథం చేసారు._

మంత్రి ఉమా వెంట వేలాదిమంది కార్యకర్తల నడక

మైలవరం నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశానికి ఏపి మంత్రి దేవినేని ఉమా విచ్చేసిన సంధర్భంగా మైలవరం సూరిబాబు గారి పార్క్ ఆవరణలో రాజా SVPJ గోపాలరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ నుండి గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా దాదాపు 5వేల మంది కార్యకర్తలతో భారీ పాదయాత్ర చేపట్టారు. కార్యకర్తలతో పాటు నడిచి మైలవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉమా పాల్గొన్నారు. మైలవరంలో నిరుపేదలందరికి నివేశన స్థలాలు ఇచ్చి ఆ ప్రాంతాన్ని మైలవరంకు మరో మణిహారంగా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. ఈ సభలో మైలవరం నియోజకవర్గంలో చేసిన, చేస్తున్న “మీ కోసమే నేను… మీ ప్రగతికై నేను” కరపత్రాన్ని విడుదల చేసారు._

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here