అనంతలో నడి రోడ్డుపై దారుణం!

అనంతపురం నగరపాలక సంస్థ డీఈ కిష్టప్పపై కాంట్రాక్టర్ నరసింహారెడ్డి దాడి చేశారు. నడి రోడ్డుపై కిందపడేసి కాళ్లతో తన్నాడు. తీవ్రంగా హెచ్చరించి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో బాధిత ఉద్యోగి వన్‌టౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం సృష్టిస్తోంది.
నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏఈ మహదేవప్రసాద్తో స్వీపింగ్ మిషన్ కాంట్రాక్టర్ నరసింహారెడ్డి సాయంత్రం వాగ్వాదం చేస్తుండగా వాటర్ సప్లై డీఈ కిష్టప్ప వారించాడు. ఎందుకు గొడవలంటూ చెప్పడంతో సాయంత్రం ఇద్దరి మధ్య భారీ స్థాయిలో వాగ్వాదం జరిగింది.
అధికారులు, కాంట్రాక్టర్లు సర్దిచెప్పడంతో ఆ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే తనపై ఘర్షణకు దిగిన డీఈ కిష్టప్పపై కోపం పెంచుకున్న సదరు కాంట్రాక్టర్ డీఈని వెంబడించారు. నగరంలోని నామా టవర్స్ సమీపంలోకి వెళ్లగానే వెనుక నుంచి కారులో వస్తూ ఎడమ చేత్తో మెడపై గట్టిగా కొట్టాడు. ఏంటయ్యా అలా కొడతావంటూ సదరు కాంట్రాక్టర్‌ను డీఈ నిలదీసి, గట్టిగా హెచ్చరించి వెళ్లిపోయాడు. అయితే మరింత కోపంతో రగిలిపోయిన కాంట్రాక్టర్ మరోసారి డీఈని వెంబడించి రఘువీరా టవర్స్ ముందు ఉన్న సందులో కారు ఆపి దాడికి దిగారు. డీఈని కిందపడేసి కొట్టాడు. కాంట్రాక్టర్ నరసింహారెడ్డి డీఈ కిష్టప్ప ముఖంపై, తలపై తంతూ దాడికి చేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
కాంట్రాక్టర్ దాడిలో డీఈకి పెదవి, ముఖంపై, వీపు భాగంలో గాయాలయ్యాయి. బాధిత డీఈ తనపై జరిగిన దాడిని మేయర్ స్వరూప, కమిషనర్ మూర్తి, ఎస్ఈ నాగమోహన్, తోటి ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మేయర్ స్వరూప, ఇతర అధికారులు, కార్పొరేటర్ల సమక్షంలో వన్‌టౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. భౌతికదాడికి దిగడం సబబుకాదని, దాడి చేసిన సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐ కృష్ణమోహన్‌ను కోరారు. సాయంత్రం కార్యాలయంలో ఏఈతో వాగ్వాదం చేస్తుంటే ఎందుకు అరుస్తావంటూ సూచించానని డీఈ కిష్టప్ప తెలిపారు. వారించినందుకే తనపై రఘువీరా టవర్స్ ముందు సందులో కింద పడేసి దాడి చేశాడన్నారు. తనపై కాంట్రాక్టర్ నరసింహారెడ్డి దాడి చేశాడంటూ డీఈ కిష్టప్ప ఫిర్యాదు చేశారని సీఐ క్రిష్ణమోహన్ తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేశామన్నారు.
నేడు మున్సిపల్ కార్పొరేషన్ బంద్
అనంతపురం కార్పొరేషన్ : డీఈపై కాంట్రాక్టర్ దాడిని నిరసిస్తూ నగరపాలక సంస్థ ఉద్యోగులు నిరసన బాట పట్టనున్నారు. డీఈ కిష్టప్పపై దాడికి నిరసనగా మంగళవారం బంద్ పాటించనున్నారు. డీఈపై స్వీపింగ్ మిషన్ కాంట్రాక్టర్ నరసింహారెడ్డి దాడిని ఖండిస్తూ మున్సిపల్‌కార్పొరేషన్ అన్ని విభాగాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు నిరసన తెలపనున్నారు. మంగళవారం రాత్రి కమిషనర్ మూర్తితో ఇదే విషయంపై చర్చించారు. మున్సిపల్ సేవలు నిలిపివేస్తామని ఉద్యోగుల అభిప్రాయాన్ని ఆయన ఖండించారు. మున్సిపల్ సేవలు నిలిపి వేస్తే ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని, విరమించుకోవాలని సూచించారు. దీంతో ఉద్యోగులు వెనక్కు తగ్గారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరసనకు దిగనున్నారు. నేడు మున్సిపల్ కార్పొరేషన్‌ను బంద్ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *