అనంత జిల్లాలో కొరియా కల్చర్‌ !!


ఏమిటీ… చైనా భాష! ఇంతకీ మనం ఎక్కడున్నాం? పొరపాటున బోర్డర్‌ దాటి చైనాలోగానీ అడుగుపెట్టలేదు కదా!… అని ఆశ్చర్యపోకండి! ముందుగా చెప్పొచ్చేదేమిటంటే… ఇది కొరియా భాష! ఇది… అచ్చంగా ఆంధ్ర ప్రదేశే. అందునా… అనంతపురం జిల్లా! అనంతపురంతోపాటు జిల్లాలోని పెనుకొండ, హిందూపురం తదితర ప్రాంతాల్లో ఇలా కొరియా భాషలో స్వాగతం పలికే బోర్డులు ఇప్పుడు అనేకం కనిపిస్తాయి.

ఇదంతా… ‘కియ’ కార్ల కంపెనీ మహిమ! ఆంధప్రదేశ్‌ పారిశ్రామిక ప్రగతిలో మేలిమలుపైన ‘కియ’ రాకతో అనంతపురంలో సరికొత్త సందడి మొదలైంది. మరీ ముఖ్యంగా ఈ కార్ల ప్లాంటు ఏర్పాటవుతున్న పెనుకొండ ప్రాంతంలో కొరియా సంస్కృతి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కియ పరిశ్రమ ప్రాంగణంలో నాలుగు కంపెనీలు పనులు చేస్తున్నాయి. వాటిలో 50 మంది దాకా కొరియన్లు పని చేస్తున్నారు. హ్యుండయ్‌ కార్ల పరిశ్రమకు చెందిన మరో 50 మందికిపైగా ఉన్నతస్థాయి అధికారులు కూడా ఉన్నారు. పని చేసే చోటు నుంచి బెంగళూరు ఎయిర్‌ పోర్టుకు గంట వ్యవధిలో, తమ నివాసానికి 20 నిమిషాల్లో చేరుకునేందుకు వీరు ప్రాధాన్యమిస్తున్నారు.

కియ కోసం వచ్చిన కొరియన్లతోపాటు ఇక్కడ పనులు చేస్తున్న స్థానిక కాంట్రాక్టర్లు, ఇంజనీర్ల రాకతో ఇక్కడ ఇళ్లకోసం డిమాండ్‌ భారీగా పెరిగింది. కియ ప్లాంటుకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుకొండ పట్టణంలో డబుల్‌ బెడ్‌రూం అద్దె నెలకు రూ.40 వేలకు చేరుకుంది. పెనుకొండతోపాటు… 44వ నెంబరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పట్టణాల్లో నివాసం ఉండడానికి కొరియన్‌ సిబ్బంది మొగ్గు చూపుతున్నారు. కొత్తగా నిర్మిస్తున్న కొన్ని అపార్ట్‌మెంట్లలోనూ, వ్యక్తిగత ఇళ్లముందూ కొరియా భాషలో ఫ్లెక్సీలు వెలిశాయి.

బోల్తాపడిన చిరు కాంట్రాక్టర్‌..
కియ పరిశ్రమకు సమీపంలో పేరేసంద్రం అనే గ్రామం ఉంది. అక్కడ ఒక చిన్నసైజు కాంట్రాక్టర్‌ కియ ఉద్యోగికి దగ్గరయ్యాడు. తమకోసం 90 అద్దె గదులు ఏర్పాటు చేయాలంటూ ఆ ఉద్యోగి రూ.30 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చాడు. ‘మంచి చాన్స్‌’ దొరికిందనుకుంటూ ఆ కాంట్రాక్టరు సుమారు రూ.4 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టి అపార్ట్‌మెంట్‌ నిర్మించాడు. అందులోని ఓ ఇంటిలో కొరియా ఉద్యోగి చేరాడు. కానీ… అద్దె ఎక్కువగా ఉందంటూ తాను ఖాళీ చేయడమేకాకుండా, తాను అడిగిన 90 గదులూ వద్దని స్పష్టం చేశాడు. దీంతో ఆ చిరు కాంట్రాక్టర్‌ బోరుమంటున్నాడు.

కమీషన్లతో కళకళ
పెనుకొండ, అనంతపురం ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూం అద్దె మహా అంటే రూ. 6 వేల నుంచి రూ. 10 వేల వరకూ ఉంటుంది. అదే ధరతో హైవేకు ఆనుకుని ఉన్న ఇండిపెండెంట్‌ హౌస్‌లు, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లపై మధ్యవర్తులు దృష్టి సారించారు. వారి నుంచి ఇళ్లు అద్దెకు తీసుకుని మూడు నుంచి ఐదేళ్ల కాల పరిమితితో అగ్రిమెంటు రాసుకుంటున్నారు. అదే ఇళ్లను కొరియన్లకు రూ.30వేల నుంచి 40 వేలతో అద్దెకు ఇస్తున్నారు. కొరియన్లతో మాట్లాడేందుకు తమకు భాష రాకపోవడంతో… ఇందుకు అనువాదకుల సేవకులు ఉపయోగించుకుంటున్నారు. కొందరు బెంగళూరు నుంచి కూడా వచ్చి మరీ ‘అనువాద’ పనులు చేస్తున్నారు. కొరియన్లకు అద్దె ఇంటిని కుదిర్చితే… మధ్యవర్తులే వీరికి రూ.20వేల దాకా కమీషన్‌ చెల్లిస్తున్నారు.

స్పానిష్‌ టు కొరియన్‌
స్పెయిన్‌కు చెందిన మ్యాంచూ ఫెర్రర్‌ అనంతపురం కేంద్రంగా ‘ఆర్డీటీ’ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. సంస్థ అవసరాల రీత్యా చాలామందికి స్పానిష్‌ నేర్పిస్తున్నారు. ఆర్డీటీ సంస్థలోనే స్పెయిన్‌ భాష నేర్పే ప్రొఫెషనల్‌ స్కూల్‌ ఉంది. దీనికి ఎస్కే యూనివర్సిటీ గుర్తింపునిచ్చింది. దీని ద్వారా ఇప్పటివరకూ నాలుగువేల మంది స్పెయిన్‌ భాష నేర్చుకున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో కియ ప్రభావంతో కొరియన్‌ భాష నేర్పించే సంస్థలూ ఆవిర్భవించే అవకాశముందని స్థానిక విద్యావేత్తలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *