‘అగ్రపధం-ఆనందం’ మన లక్ష్యం జిల్లా కలెక్టర్లకు సీఎం నిర్దేశం!

78

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నెంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిపేలా, రాష్ట్రంలో అందరినీ ఆనందంగా వుంచేలా మనపై గురుతర బాధ్యత వుందని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందుకు మనలో సాధించాలనే తపన, నిరంతర శ్రమ అవసరమని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మన బాధ్యతని, విజన్‌ను ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మార్పు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను నిర్దేశించారు. స్థూలంగా చూస్తే మనమంతా బాగా పనిచేసినా, సూక్ష్మ స్థాయిలో మన పనితీరు ఇంకా మెరుగుపరచుకోవాల్సి వుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయంలో రెండు రోజుల కలెక్టర్ల సమావేశం మనకు మరింత స్పష్టత తెస్తుందని ఆశిస్తున్నామన్నారు.

మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో జరిగిన జిల్లా కలెక్టర్ల 16వ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మన సాధించిన పథకాలు, అవార్డులు మనకు స్ఫూర్తిని ఇస్తుంటాయని చెప్పారు. ఈ నాలుగు సంవత్సరాలు కష్టపడి, దేశంలో ఎక్కడా జరగని అభివృధ్ది ఏపీలో జరిగేలా కృషి చేసిన ఉద్యోగులు, అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించుకుంటున్నామని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఫలితాలు ఏవిధంగా వున్నాయో సమీక్షించుకుని, వాటి ఆధారంగా పాలన సాగిస్తున్నామని చెప్పారు. జూన్ 2కు నవ్యాంధ్రప్రదేశ్‌లో పాలనకు నాలుగేళ్లు నిండుతున్నాయని, ఆరోజు నవనిర్మాణ దీక్షను అందరిలో స్ఫూర్తి కలిగించేలా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
సంక్షేమంపై నిర్లక్ష్యం వద్దు
‘సంక్షేమం, అభివృద్ధి రెండింటి మీద సమాన దృష్టి పెట్టాం. సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా నిర్లక్ష్యం వుండకూడదు, ప్రజా సంతృప్తి ప్రధానం. ఉన్న చోటు నుంచే సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకునేలా చర్యలు తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రజా సంతృప్తిని ప్రాతిపాదికగా తీసుకుంటున్నాం, ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి అభ్యాసం జరగడం లేదు. మన రాష్ట్రంలో అందరి అభిప్రాయాన్ని అన్ని విషయాల్లోనూ తీసుకుంటున్నాం. ఎవరు లబ్ది పొందుతున్నారో వారి దగ్గర సమాచారం తీసుకుని సంతృప్థి స్ధాయిని అంచనా వేస్తున్నాం.’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
సంక్షేమానికి రూ. వేల కోట్లు
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. సంక్షేమ పథకాల అమలు ఒక్కటే పేదరిక నిర్మూలనకు పరిష్కారం కాదు. స్థిరమైన ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రజారోగ్యంపై భారీగా నిధులు ఖర్చు చేయడం ద్వారా పేదలు అప్పులపాలు కాకుండా చూడగలం.’ అని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు సూచించారు.
త్వరలో 5 లక్షల మందికి పింఛన్లు
రాష్ట్రంలో 47 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, రానున్న రోజుల్లో అర్హత కలిగిన మరో 5 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చక్కెర నిలిపేసినా పేదవారికి చక్కెర అర కిలో ఇస్తున్నామని, పేదల్లో పోషకాహార లోపం లేకుండా కందిపప్పు ఇస్తున్నామని అన్నారు. కుటుంబ సభ్యుల మరణం కారణంగా అభద్రతతో ఏ కుటుంబం కుప్పకూలిపోకుండా ‘చంద్రన్న బీమా’ కింద రూ. 5 లక్షలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ‘చంద్రన్న బీమా’ కింద పరిహారాన్ని సకాలంలో ఇవ్వడంతో ప్రజల్లో సంతృప్తి అత్యధికంగా వుందన్నారు. మనం పనిచేస్తే ప్రజలు ఏ విధంగా అభినందిస్తారో ఇదే ఉదాహరణగా చెప్పారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా ‘చంద్రన్న పెళ్లికానుక’ను లబ్దిదారుల ఖాతాకు నేరుగా వేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 75 యూనిట్లు వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని, నరేగా కింద 100 రోజులు ఉపాధి హామీ కల్పిస్తున్నామని అన్నారు.
వచ్చే నెల నుంచి నిరుద్యోగ భృతి, అన్న కేంటిన్లు
యువతకు ‘నిరుద్యోగ భృతి’ వచ్చే నెల నుంచి ప్రారంభించాలని అనుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే వచ్చే నెల 2 నుంచి కొత్తగా ‘అన్న కేంటిన్లు’ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరం పోషకాహార లోపం అనేది లేకుండా చేయాలని సంకల్పించామని అన్నారు.
విద్యుత్ చార్జీలు పెంచకపోవడం మన విజయం
విద్యుత్ కొరతను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో అధిగమించామని, ఇప్పుడు మిగులు సాధించామని తెలిపిన ముఖ్యమంత్రి విద్యుత్ చార్జీలు పెంచమని ధైర్యంగా చెప్పామని, వంద శాతం విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. మనకన్నా ఎక్కువ వనరులు వున్న రాష్ట్రాలు కూడా మనలాగా వంద శాతం గ్యాస్, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేకపోయాయని పేర్కొన్నారు.
ఈ ఏడాదిలోగా కోటి ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు
ఈ ఏడాదిలోగా కోటి ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు ఇస్తామని, నాలుగేళ్లలో 16 వేల కి.మీ. మేర సీసీ రోడ్లు వేశామని, మరో 3 వేల కి.మీ వరకు సీసీ రోడ్లు వేసేందుకు అవకాశం వుందని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామీణ మౌలికవసతుల్లో ముందున్నాం‘కనీస మౌలిక వసతులపై జిల్లా కలెక్టర్లు ముందుగా దృష్టి పెట్టాలి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనలో ముందున్నాం. పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, పాఠశాల భవనాలు-ప్రహరీగోడలు నిర్మించుకున్నాం. మిగిలిన మౌలికవసతులు కల్పించాలి. సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి.’ అని ముఖ్యమంత్రి అన్నారు. అక్టోబర్ 2 నాటికి నూటికి నూరు శాతం గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చాలని సూచించారు. తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు పట్టణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు రూ.12 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.

ఈ ఏడాది కృష్ణా డెల్టాకు 200 టీఎంసీలు
పట్టిసీమ నుంచి 130 టీఎంసీల వరకు నీటికి కృష్ణా డెల్టాకు తీసుకువచ్చామని, ఈ ఏడాది 200 టీఎంసీలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. సూక్ష్మ సేద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రతీఏడాది రెండున్నర లక్షల ఎకరాలలో అదనంగా సూక్ష్మ సేద్యం సాగు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. దీంతో తక్కువ నీటితోనే ఎక్కువ ఫలితాలు రాబట్టగలుగుతున్నామని చెప్పారు. వర్షపునీటిని భూగర్భజలాలుగా మార్చడంలోనూ విజయం సాధించామని అన్నారు.
6 వేల వర్చువల్ క్లాస్‌ రూములు
విద్యారంగంలోనూ ప్రగతి సాధిస్తున్నామని, ఈ ఏడాది 6 వేల తరగతి గదుల్లో వర్చువల్ క్లాస్‌ రూములు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ర్యాంకింగ్, అక్రిడేషన్‌లోనూ మన విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకుంటున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఐఐటీలో 12% మన పిల్లలకు ర్యాంకులు వచ్చాయని, ఇది మనకు గర్వకారణంగా చెప్పారు. మన జనాభాకు మూడు రెట్లు ఎక్కువగా సీట్లు సాధించడం అసాధారణంగా అభివర్ణించారు. జీఎస్‌డీపీలో వెనకున్నా, తెలివితేటల్లో శ్రీకాకుళం జిల్లా ముందుందని జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించడాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు.
11 లక్షల మందికి ఉద్యోగావకాశాలు
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలతో 11 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశం వుందని ముఖ్యమంత్రి అన్నారు. ఎంఎస్‌ఎంఈ యూనిట్లు నెలకొల్పేలా ప్రోత్సహించాలని కలెక్టర్లకు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలలో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు కృషి జరగాలని నిర్దేశించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయన్నారు.
టెక్నాలజీతో మంచి – చెడు
టెక్నాలజీ వల్ల మంచితో పాటు, చెడు ఉందని, ఉపయోగించుకునే విధానంలోనే అంతా వుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. యువత టెక్నాలజీ వల్ల చెడిపోయే పరిస్థితి రాకూడదని చెప్పారు. ప్రభుత్వం కఠినంగా ఉంది, శిక్ష తప్పదని భావించాడు కాబట్టే దాచేపల్లి ఘటనలో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.
‘ఎక్కడో వుండాల్సిన వాళ్లం ఇక్కడే వున్నాం’
‘విభజనలో మనకు అన్యాయం జరిగింది. ఎక్కడో వుండాల్సిన వాళ్లం కింది వరుసకు వచ్చాం. విభజనతో సమస్యల్లో వున్నామనుకుంటే కేంద్రం సహకరించకుండా పోయింది. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆనాడు ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకున్నాం. మనకిచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే కేంద్రంతో విభేదించాం. మనం గట్టిగా అడగకపోతే ఇంకా నష్ట పోతామనే ప్రశ్నిస్తున్నాం.’ అని ముఖ్యమంత్రి అన్నారు.
జనభా నియంత్రణకు నాడు తన హయాంలో తీసుకున్న చర్యలతో మంచి ఫలితాలు సాధించామని, జనాభా నియంత్రణలో కేరళతో పోటీ పడ్డామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం జనాభా నియంత్రణ నుంచి జనాభా సమతుల్యత సాధన దిశగా మన ఆలోచనా విధానం మారాలని చెప్పారు. 15వ ఆర్ధిక సంఘం 2011 జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే ఇంకా నష్టపోతామని అన్నారు. 14వ ఆర్థిక సంఘం కూడా 1971 జనాభా ప్రాతిపదికగా తీసుకుంది అని చెప్పారు. 2011 జనాభా లెక్కలతో పార్లమెంటు సీట్లు కూడా దక్షిణ భారతదేశానికి తగ్గిపోయే ప్రమాదం వుందని చెప్పారు. ఇది ప్రగతి శీల రాష్ట్రాలకు అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు. అటు విభజన వల్ల, ఇటు 15వ ఆర్ధిక సంఘం విధివిధానాల వల్ల మనం తీవ్రంగా నష్టపోతామని తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రసంగం ముఖ్యాంశాలు :
 జీఎస్‌డీపీలో 65 శాతం వాటా సేవలరంగం నుంచే వుండాలి. మన పొరుగు రాష్ట్రాలు ఈ విషయంలో మనకన్నా ముందున్నాయి.
 2017-18లో వ్యవసాయ, అనుబంధ రంగాలలో వృద్ధి రేటు రూ. 1,63,635 జీవీఏతో 17.76 శాతం నమోదు కాగా, అదే జాతీయస్థాయిలో వృద్ధి రేటు 3 శాతంగా ఉంది.
 2017-18లో పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు రూ. 1,42,837 జీవీఏతో 8.49 శాతం నమోదు కాగా, జాతీయస్థాయిలో 4.8 శాతం వృద్ధి రేటు వుంది.
 2017-18లో సేవారంగంలో వృద్ధి రేటు రూ. 2,41,967 జీవీఏతో 9.11 శాతం నమోదు కాగా, జాతీయస్థాయిలో వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంది.
 2017-18 ఆర్థిక సంవత్సరంలో 11.39 శాతం వృద్ది రేటుతో రాష్ట్ర జీవీఏ రూ. 5,48,439 వుండగా, జాతీయ స్థాయిలో అది 6.4 శాతం వృద్ధి రేటుతో రూ. 1,19,64,479గా ఉంది.

 2017-18లో 11.22 వృద్ధి రేటుతో రాష్ట్ర జీఎస్‌డీపీ రూ. 6,07,388గా వుండగా, అదే జాతీయస్థాయిలో 6.

6 శాతం వృద్ధి రేటుతో రూ. 1,30,03,897గా వుంది.
2017-18లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,42,054 వుంటే, జాతీయ తలసరి ఆదాయం రూ. 1,12,764 వుందని ముఖ్యమంత్రి అన్నారు. తలసరి ఆదాయంలో మనం దేశంలో 9వ స్థానంలో వున్నామని చెప్పారు. 2022 నాటికి మూడు అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా నిలవాలి అనుకుంటున్నామని, ఇది అసాధ్యమేమీ కాదన్నారు. పరిశ్రమలు, సేవలరంగంపై ప్రధానంగా దృష్టిపెట్టాలని, అప్పుడే మనం అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చూడవచ్చని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here