అక్టోబర్ లో ‘జయహో బీసీ’ సదస్సు: చంద్రబాబు

94

అమరావతిలో టీడీపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్
అక్టోబర్ నాలుగో వారంలో ఈ సదస్సు నిర్వహిస్తాం
టీడీపీకి తొలి నుంచి బీసీలే అండదండలు టీడీపీ ఆధ్వర్యంలో అక్టోబర్ లో ‘జయహో బీసీ’ సదస్సు నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘జయహో బీసీ’ సదస్సుని ‘దేశంలో సగం – తెలుగుదేశంలో మనం’ అనే ఉపశీర్షికతో నిర్వహించనున్నామని, విజయదశమి తర్వాత అక్టోబర్ నాలుగో వారంలో ఈ సదస్సు ఉంటుందని చెప్పారు. టీడీపీకి తొలి నుంచి బీసీలే అండదండలుగా ఉన్నారని, బీసీల రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించనున్నామని అన్నారు. ‘మహానాడు’ తరహాలో రెండు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహిస్తామని, తొలిరోజు అన్ని బీసీ కులాల వారితో సమావేశాలు నిర్వహిస్తామని, రెండో రోజు భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. వచ్చే పదిహేనేళ్లలోనే రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని, ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ గల రాష్ట్రంగా ఏపీ అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తొలుత ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ చిత్ర పటాలకు చంద్రబాబు, పార్టీ నేతలు నివాళులర్పించారు. హరికృష్ణ మృతిపై సంతాప తీర్మానాన్ని కళావెంకట్రావు ప్రవేశపెట్టారు.

టీడీపీ కొత్త కార్యాలయం త్రీడీ నమూనా విడుదల

టీడీపీ కొత్త కార్యాలయం త్రీడీ నమూనాను చంద్రబాబు విడుదల చేశారు. రెండు లక్షల చ.అ. విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నామని, 3 బ్లాకులుగా ఈ కొత్త కార్యాలయ నిర్మాణం ఉంటుందని, నవంబర్ నెలాఖరు లోపు భవన నిర్మాణం పూర్తవుతుందని చంద్రబాబు చెప్పారు. డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కంటే 5 రెట్లు పెద్దదిగా ఈ కొత్త కార్యాలయ నిర్మాణం ఉంటుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here